Thursday, May 03, 2007

ఎద్యం...

ఎదలోంచి వచ్చిన పద్యాన్ని నేను (మీరు కాదనరు అనే నమ్మకంతో) ఎద్యం అంటున్నా...
ఎద్దేవా చెయ్యకుండా ఈ ఎద్యం చదువుకోండి మరి ...

అటు నించి తను
ఇటు నించి నేను
*
యుగ యుగాల విరహ వేదన
మరు క్షణంలో కరిగిపోతుందనే భావన
* *
అందుకున్నా ఆలింగనం
అందులోని ఆ కమ్మదనం
* * *
అంతలో.
ఆ కౌగిలింతలో..
ఆ పులకింతలో...
* * * *
కచ్చితమైన ధోరణి లో నా రాణి వాణి
"సచ్చినోడా!వదులు,ఊపిరాడక చస్తున్నా!!" అని

Wednesday, May 02, 2007

తెగులు వ్యాకరణం

తెలుగు వ్యాకరణం:
అమ్మహారణం = ఆ + మహారణం -> త్రిక సంధి
తెగులు వ్యాకరణం:
అమ్మాయా? = ఆ + మాయా? -> త్రిష సంధి

Monday, April 30, 2007

వే"మన" పద్యాలు - 1

తెలియని ప్లాట్‌ఫాం మీద అధికులమనరాదు
డల్లుగుండుటెల్ల నల్లు (null) కాదు
జిప్పు చెసిన ఫైలు మెమరీ తగ్గదా?
సాఫ్ట్‌వేరు బైట్సు, వినరా గేట్సు

నా ఈ కళా ఖండానికి,ప్రజా కవి వేమన ఓ 500 ఏళ్ల క్రితమే పేరడీ రాసాడని ఈ క్రింది పద్యం చదివితే ఇట్టే తెలిసిపోతుంది. అఫ్కోర్స్, మరీ కాపీ-పేస్ట్ కాకుండా "ఆట వెలది" లో రాసాడనుకొండి.

అనువుగాని చోట అధికులమనరాదు
కొంచెముండుటెల్ల కొదువ కాదు
కొండ యద్దమందు కొంచెమై వుండదా
విశ్వదాభి రామ వినుర వేమ

Thursday, April 26, 2007

సాహితీ సమోసా

నా తవికలు సాహితీ సమోసాలు .
నా తవికలు సాహితీ సమోసాలు ..
వైకుంఠ యాత్ర కు ఒక్కటి చాలు ...

Friday, April 20, 2007

అర కవిత ...

అరవిచ్చిన నీ కన్నులు చూస్తే
అరవాలనిపిస్తుంది...
అరువిచ్చిన నీ బాబుని చూస్తే
అరికాళ్ళకు బుద్ధొస్తుంది......

కష్ట పదార్ధాలు ( పద + అర్ధాలు) :

అరవిచ్చిన = సగం తెరిచి వున్న; అరువిచ్చిన = అప్పు ఇచ్చిన; నీ బాబుని = నీ తండ్రిని;

టీకా తాత్పర్యం:

మిగతాది బోధపడుతుంది గానీ.. ఈ "అరికాళ్ళకు బుద్ధొస్తుంది" ఉంది చూసారూ... దీనికి కొంచెం విశ్లేషణ ఇస్తా.అందరి మస్తిష్కాలూ నా లాగా సూదిగా ( షార్ప్ గా) ఉండవు కదా ... కాళ్ళకు బుద్ధి చెప్పటం అంటే పరిగెత్తటం, ఉదాహరణ కి "నా గొంతు విని, బుద్ధున్న శ్రోతలంతా కాళ్ళకు బుద్ధి చెప్పారు". మరి కాళ్ళకు బుద్ధొస్తే అరికాళ్ళకు బుద్ధి రాదా? అందుకే ఆ బల "పద" ప్రయోగం. ఏంటీ? బుర్ర మోకాళ్ళ ప్రాంతానికి ప్రయాణం మొదలుపెట్టిందా?

వారాంతాన్ని ఆద్యంతం అనుభవించండి ....

Thursday, April 19, 2007

తవిక ...

పగలూ రేయీ నీకై వెతికా
నిను పొందని నాది .. నాదీ ఓ బతుకా
పూణె లో ఆంధ్రా భోజనం
ఎక్కుడున్నా... అందుకో నా నీరాజనం

Wednesday, April 18, 2007

తవిక ...

కన్నులలో నిను దాస్తే కనుపాపలకిబ్బంది
తనలో నిను దాస్తానంటే,ఎద,ఎందుకులే...లైటంది

Tuesday, April 17, 2007

Oosu Poka ....

తెలుగు లో వాగటం చాలా వీజీ గానీ, బ్లాగటం మా కష్టమండి. ఫుట్టి బుద్ధెరిగి పెద్దగా కష్టపడింది లేదు కాబట్టి ఈ విషయంలో కొంచెం ప్రయత్నం చేద్దామని ఇటు వైపొచ్చా.

ముఖ్య గమనిక ఏంటంటే, ఇక్కడ పెద్ద విషయం ఉండదు. ఉన్న విషయం ఒక పద్ధతి లో అస్సలుండదు.

నా గురించి ఇప్పటి దాకా తెలీని అద్రుష్టవంతులకోసం నే చెప్పొచ్చీదేటంటే నేను (సైతం) పుణే లొ ప్రముఖ భారతీయ బహుళ జాతి సాఫ్ట్‌వేర్ సంస్థ లో పంచేస్తున్నా.షార్ట్ టెర్మ్ బదిలీ పథకం మీద ఇక్కడికి తగలడి మూడున్నర నెలలౌతుంది. అంతా సవ్యంగా జరిగితే ఇంకో మూడు వారాల్లో ఇక్కడ బిచాణా ఎత్తేసి మన హైదరాబాద్ కి జంపు జిలాని.

పుణే లొ బతుకు అంత కష్టమా? అంత లేదు. ఎటొచ్చీ సినిమాలతొనే పెద్ద చిక్కు. రెన్నెల్లకో మూన్నెల్లకో ఒక తెలుగు సినిమా వస్తుంది.ఆప్పటి దాకా కళ్ళు కట్టుకుని కూచోటం కష్టం కదా. మనలొ మన మాట మనకు కొంచెం పిక్చర్ల పిచ్చి. మరిన్ని వివరాలకు సంప్రదించండి సినీటెల్ డాట్ బ్లాగ్‌స్పాట్ డాట్ కాం. ఆ దుఖానం కూడా మనదే. ఇక్కడికి వచ్చాక పోష్ట్లు లేక ఈగలు తోలుతున్నాం, కొంచెం బేరం చేసి వెళ్ళండి. ఇక రెండో కష్టం. భోజనం. మనం కొంచెం ఆహారప్రియులం లెండి. విమర్శకుల కొందరు అభిమానం కొద్దీ "తిండిబోతు" అంటూంటారు. ఐతే మనం ఆ వ్యాఖ్య ని "కుక్క మొరిగింది" కేటగిరి లో పడేసి తదుపరి ఆర్డర్ ఇచ్చేస్తుంటాం ... విచ్చల విడిగా. పుణే లొ మాదక ద్రవ్యాలు సుళువు గా దొరుకుతయ్ ఆంధ్రా భోజనం కన్నా.. గత నెల జరిగిన డ్రగ్స్ కేసు గుర్తుంది కదా. చాలా మంది యూత్ ని అరస్టు చేసారు. సరిగ్గా ఆ యూత్ పాయింటు దగ్గరే మనం బతికి పోయాం. అయ్యబాబోయ్ ఇదంతా హాసికానికండి బాబూ... డ్రగ్సూ లేవు .. బగ్సూ లేవు... సిగిరెట్టు నోట్లో పెడితే కొరకాలా నమలాలా అని అడిగే టైపు నేను. మళ్ళీ విషయానికొస్తే, ఇక్కడ వాళ్ళకి కొంచెం చక్కెర అన్నా ఎండు ద్రాక్ష అన్నా మక్కువ ఎక్కువ. దేంట్లో పడితే దాంట్లో ఇబ్బడి ముబ్బడిగా వాడేస్తుంటారు, చివరాఖరికి చికెన్ బిర్యాని లో కూడా ... చిరాగ్గా. సరిగ్గా అక్కడే మనకి కడుపు మండిపోయేది. మూడో కష్టం భాష.ముజే ఉస్కే బారే మే బాత్ తక్ నహీ కర్నీ హై (సహోద్యోగి సౌజన్యంతో).

ఇప్పుడు పాజిటివ్ పాయింట్స్. ఒకటి అమ్మాయిలు. రెండు గాల్స్. మూడు లడ్కియాన్. ఔనండి. మన హైదరాబాద్ ని "సిటి ఆఫ్ కబాబ్స్" ( సారి, "సిటి ఆఫ్ నవాబ్స్" ) అన్నట్టే నన్నడిగితే సిగ్గు,శరం,ఎగ్గు,అభిమానం లేకుండా పుణే ని "సిటి ఆఫ్ గులాబ్స్" అంటాను. గులాబ్స్ అంటే గులాబి పూలో, గులాబ్ జామున్ స్వీట్లో కాదు, గులాబిలు లాంటి అమ్మాయిలు.అప్సరసలు. పూణే మహిళా మండలి సభ్యుల్లో చెప్పుకోదగ్గ అందం తర్వాత చెప్పుకోదగ్గ అంశం, వారి దుస్తత్వం (డ్రసింగ్ సెన్స్). ఎవరు ఏమి వేసుకుంటే బావుంటారో, వాళ్ళు అవే వేసుకుంటారు. జీన్స్ ఫిట్ అయ్యేవాళ్ళు మాత్రమే ( హైదరాబాద్ అమ్మాయిలు, వాళ్ళ బాధిత బాయ్ ఫ్రెండ్సు గమనించగలరు ) జీన్స్ వేసుకుంటారు. లేనోళ్ళు (బహు కొద్ది మంది) లైట్ తీసుకుంటారు. మన ఏ.పి నించి ఇక్కడికి వస్తే ఎడారి నించి సరాసరి ఇడెన్ గార్డెన్స్ కి వచ్చినట్లుంటుంది. ముఖ్యంగా వారాంతపు సాయంత్రాలలో ఎం.జి రోడ్,ఎఫ్.సి రోడ్ మరియు ఆ పరిసర ప్రాంతాల్లో రంభ, ఊర్వశి, మేనక, తిలోత్తమలు, వారి నకళ్ళు యధేచ్చగా తిరుగుతూంటరు. అదన్న మాట.

ఈ పోస్టు ఇంతటితో సమాప్తం. ఏంటి అవాక్కయ్యారా? ఇదే మన ఇష్టైల్.

ప్రస్తుతానికి ఇక్కడాపుదాం. నాకు ఓపిక ఉంటే మళ్ళీ రాస్తా. మీకు తీరికుంటే మళ్ళీ రండి.

అంత వరకు సెలవు. నమస్కారం.